Nagamani Malligari October 4, 2026prabhanews.com
24 గంటల మాటేమోగానీ.. పది గంటలైనా దిక్కులేదు
పొట్ట దశలో వరి.. నీరందక అన్నదాతల్లో ఆందోళన
కనీసం 16 గంటలైనా నిరంతరాయంగా సరఫరా చేయాలి
సీపీఐ జిల్లా నేత పోకల వెంకటేశ్వర్లు డిమాండ్
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సాగర్ ఆయకట్టు పరిధిలో తీవ్రంగా కొనసాగుతున్న విద్యుత్ కోతలతో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం కనీసం 8 నుంచి 10 గంటలైనా సక్రమంగా సరఫరా చేయకపోవడం దుర్మార్గమన్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో మడులకు సక్రమంగా నీరందడం లేదన్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నందున నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గిన కారణంగా విద్యుదుత్పత్తి జరగడం లేదంటూ ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి అయినా సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రోజుకు కనీసం 16 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు యడ్ల అంజిరెడ్డి, చెవ్వ వెంకన్న, వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, తిరగమళ్ల కిరణ్, కట్టా అశోక్, పంగ గోవిందు, ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.
