Pavan Chandragiri October 24, 2026
సంగారెడ్డి, ప్రతినిధి (ఆంధ్రప్రభ):
కర్ణాటక రాష్ట్రంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ ప్రాంతం నుండి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తుల్జాపూర్ అమ్మవారి దర్శనార్థం వెళ్తున్న భక్తుల వాహనం కర్ణాటకలోని బసవకళ్యాణ్ సమీపంలో ప్రమాదానికి గురైంది.
ఈ దుర్ఘటనలో సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, విషయం తెలిసిన వెంటనే బసవకళ్యాణ్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేశారు; ప్రస్తుతం వారు ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించే పనిలో ఉన్నారు, అలాగే మరణించిన వారి గురించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
