Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
లింగాపూర్,ఆంధ్రప్రభ: లింగాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు అటవీశాఖ అధికారులు ఆటంకాలు కల్పించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాధవ్ రమేష్ అన్నారు.
ఆదివారం కస్తూర్బా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు పనులకు ఆటంకం కల్పిస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రహరీ గోడ నిర్మాణ పనులకు అధికారులు సహకరించాలని కోరారు.
విద్యార్థినుల భద్రతకు ప్రహరీ గోడ ఎంతో అవసరమని, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించి నిర్మాణ పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాధవ్ రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాధవ్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ రాథోడ్ సుమలత ఈశ్వర్, రాథోడ్ బలిరాం, లక్ష్మణ్, కైలాష్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
