Pavan Chandragiri September 1, 2026
- తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.
వేణుగోపాల్ నివాసానికి చేరుకున్న సీఎం.. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఈ అంశంపైనా సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు, పార్టీపై దాని ప్రభావం, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై అధిష్ఠానం ఆరా తీసినట్లు సమాచారం.
పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, నేతల మధ్య సమన్వయంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధిష్ఠానంలోని కీలక నేతలతో వరుసగా సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
