Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
సభకు జనాలను రప్పించినా.. నిలపలేకపోయిన వైనం
రెండు వందలు ఇస్తే వచ్చాను'.. సభ నుంచి వెళ్తూ జనం వ్యాఖ్యలు
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు నిండుసభలతో కిటకిటలాడిన రాజకీయ సభలు ఇప్పుడు బోసిపోతున్నాయా అన్న చర్చకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ 'పాంచజన్య' బహిరంగ సభ వేదికగా మారింది. కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తున్న సమయంలోనే సభకు వచ్చిన జనం ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సభ ప్రారంభంలో కొంతమేర కుర్చీలు నిండినప్పటికీ.. కవిత ప్రసంగం కొనసాగుతున్న కొద్దీ జనం బయటకు వెళ్లడం కనిపించింది. చివరకు సభలోని కుర్చీల్లో అధిక భాగం ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఖాళీ కుర్చీలే కనిపించాయి..
సభ కోసం వేలాది కుర్చీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో ఎక్కువ భాగం ఖాళీగానే కనిపించాయి. కవిత ప్రసంగం ప్రారంభమైన సమయంలో కుర్చీలు కొంత నిండుగా ఉన్నప్పటికీ.. కొద్దిసేపటికే జనం బయటకు రావడం మొదలైంది. ప్రసంగం సాగుతున్న కొద్దీ బయటకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. సభ ముగింపు సమయానికి చాలా వరకు కుర్చీలు ఖాళీ అయ్యాయి.
'రెండు వందలు ఇస్తే వచ్చాను'
సభ నుంచి బయటకు వెళ్తున్న కొందరు జనం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మపురి హిల్స్‌కు చెందిన యాదమ్మ మాట్లాడుతూ.. ''రెండు వందలు ఇస్తే వచ్చాను. సభ ఏంది.. ఎందుకు వచ్చానో నాకు తెలియదు. మా గల్లీ నాయకుడు ఒకరు రమ్మంటే ఇంటి వద్ద ఊరికే కూర్చొని ఏం చేద్దామని రెండు వందలు ఇస్తే వస్తానని చెప్పాను. ఇంక ఇవ్వలేదు'' అని తెలిపారు.
మరోవైపు సభ నుంచి బయటకు వెళ్తున్న కొందరు మాట్లాడుతూ.. ''సభ గురించి మాకేం తెలుసు. మా గ్రామంలో ఓ పెద్దమనిషి మూడు వందలు ఇస్తే వచ్చాం. కేసీఆర్ బిడ్డ అంటే వచ్చాం. పార్టీ నుంచి వెళ్లగొట్టిండ్రు అన్నది. ఆయన బిడ్డే కదా.. గిట్ల మాట్లాడుతుంది. అందుకే పోతున్నాం'' అని పేర్కొన్నారు.
కవిత తీరుపై అసంతృప్తి..
కవిత ప్రసంగ తీరుపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మినహా ప్రజా సమస్యలపై పెద్దగా మాట్లాడలేదని వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. సభ నుంచి జనం ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నప్పటికీ కవిత మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఖాళీ కుర్చీలు, బయటకు వెళ్తున్న జనం సభలో చర్చనీయాంశంగా మారారు.
