Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి, కంది, పెసర, ఆముదం, వరి పంటలు వర్షాలు లేక ఎండుముఖం పడుతున్నాయని సామాజిక కార్యకర్త హెచ్.
నర్సింహా ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్‌లోని పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు రాజప్ప, మల్లేష్ తెలిపారు. వరి పొలాలకు సరిపడా నీరు అందక నేలలు నెర్రెలు పగులుతున్నాయని, పత్తి పంటలు ఎండుముఖం పట్టి పూత, పిందెలు రాలిపోతున్నాయని వారు వాపోయారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పంటల బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని హెచ్. నర్సింహా కోరారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
