Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
పోలీసు సిబ్బందిలో ఒత్తిడి తగ్గించి పనితీరు మెరుగుపరుస్తాయి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్, ఆంధ్రప్రభ : క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం మామునూరు 4వ బెటాలియన్ టీజీఎస్‌పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ కంపెనీ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది తీరిక లేకుండా పనిచేస్తుంటారని, వారి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలు ఒక రకమైన ధ్యానం లాంటివని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం, పనితీరును మెరుగుపరుస్తాయని తెలిపారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యసాహసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అలాంటి క్రమశిక్షణతో కూడిన క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
క్రీడలు కేవలం గెలుపు, ఓటములకు సంబంధించినవి కావని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరమన్నారు. తాను చిన్నతనంలో ఇదే క్రీడా మైదానంలో పోలీసులను చూసి స్ఫూర్తి పొందానని నాగరాజు తెలిపారు. అనంతరం పోలీసు కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన తాను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. పోలీసు కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కాదని అన్నారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి బెటాలియన్ మైదానంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీసు బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సత్య శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్ కమాండెంట్లు రాజేందర్, బాలయ్య, డివిజన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ అరుణ విట్టల్, మాజీ డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాష్, సీనియర్ నాయకులు బాబురావు, కొమురెల్లి యాదవ్, శివకుమార్, వాడేపల్లి ప్రకాష్, అరుణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
