Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కుప్పం బంగారు గనులకు మళ్లీ కదలిక

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

త్వరలో ప్రారంభం కానున్న కుప్పం బంగారు గనులు !
ప్రాజెక్టు నుంచి వైదొలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ

ప్రపంచ స్థాయి టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం
ముగిసిన టెండర్ల బిడ్డింగ్ గడువు
కొనసాగుతున్న టెండర్ల ఖరారు ప్రక్రియ

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిగురుకుంట, బిసనాథం బంగారు గనుల ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వచ్చింది. గతంలో గనుల హక్కులు దక్కించుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ భూముల సమస్యల కారణంగా ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో నిలిచిపోయిన ప్రక్రియను పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026 జూన్‌లో కొత్తగా ప్రపంచస్థాయి టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో బిడ్డింగ్‌ గడువు ముగియగా, ప్రస్తుతం సాంకేతిక ప్రతిపాదనల పరిశీలన, తుది సంస్థ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని చిగురుకుంట, బిసనాథం ప్రాంతంలో సుమారు 272 నుంచి 273 హెక్టార్ల పరిధిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు వివిధ అధికారిక అన్వేషణ నివేదికలు వెల్లడించాయి. సుమారు 18.3 లక్షల టన్నుల బంగారు ఖనిజం నుంచి 9.43 టన్నుల వరకు స్వచ్ఛమైన బంగారం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. కొన్ని మైనింగ్‌ ప్రణాళికల్లో మొత్తం ఖనిజ పరిమాణం 22.16 లక్షల టన్నులుగా కూడా పేర్కొనడం గమనార్హం. ఖనిజంలో సగటున టన్నుకు 5.15 గ్రాముల వరకు బంగారం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

ఈ నిక్షేపాలు కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌కు కొనసాగింపుగా ఉన్న దక్షిణ భూభౌగోళిక శ్రేణిలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాల అన్వేషణకు దశాబ్దాల చరిత్ర ఉంది. 2018లో నిర్వహించిన ఇ-వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ అత్యధిక బిడ్డర్‌గా నిలిచి గనుల హక్కులను పొందింది. ప్రభుత్వానికి రాబడిలో 38.25 శాతం వాటా చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే గని పరిధిలోని పట్టా భూములు, భూసేకరణకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిర్దేశిత కాలంలో మైనింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించడం సాధ్యం కాలేదు.

దీంతో ఎన్‌ఎండీసీ 2025లో ఈ బ్లాక్‌ను ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. దీంతో ఈ ప్రాజెక్టును మరోసారి పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాంకేతిక బిడ్లను పరిశీలిస్తున్న నేపథ్యంలో తుది ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

భూగర్భ గనిగా అభివృద్ధి

చిగురుకుంట బంగారు గనిని పూర్తిగా భూగర్భ గని విధానంలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భారీ స్థాయిలో భూమిని తొలగించే బహిరంగ గనుల కంటే ఉపరితలంపై పర్యావరణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే గనుల తవ్వకాలు, ఖనిజాన్ని వెలికితీయడం, శుద్ధి చేయడం వంటి కార్యకలాపాలకు అవసరమైన అన్ని సాంకేతిక, పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుంది. గత మైనింగ్‌ ప్రణాళికల ప్రకారం రోజుకు సుమారు 5 కిలోలీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు.

దుమ్ము నియంత్రణకు నీటిని పిచికారీ చేయడం, నియంత్రిత పేలుళ్లు, తడిపిన డ్రిల్లింగ్‌ పద్ధతులు వంటి చర్యలను ప్రతిపాదించారు. గని కార్యకలాపాలు ప్రారంభించే ముందు తాజా మైనింగ్‌ ప్రణాళికను రూపొందించడంతోపాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి స్థాపనకు సమ్మతి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు తదితరాలను పొందాల్సి ఉంటుంది.

ఉపాధి అవకాశాలపై ఆశలు

గనుల ప్రాజెక్టు తిరిగి ప్రారంభమైతే చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మైనింగ్‌తో పాటు రవాణా, యంత్రాల నిర్వహణ, భద్రత, నిర్మాణం, సేవా రంగాల్లో స్థానికులకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే భూముల సమస్యల కారణంగా ప్రాజెక్టు ఆలస్యం కావడంతో స్థానికంగా నెలకొన్న అనిశ్చితికి కొత్త టెండర్ల ప్రక్రియతో తెరపడుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.

అయితే బిడ్డర్‌ ఎంపిక పూర్తయినంత మాత్రాన వెంటనే బంగారం ఉత్పత్తి ప్రారంభం కాదు. కొత్త సంస్థ గని లీజు పొందిన అనంతరం అవసరమైన సాంకేతిక అధ్యయనాలు, మైనింగ్‌ ప్రణాళిక, పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణ అనుమతులు, భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే వాస్తవికంగా తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం చిగురుకుంట బంగారు గనుల ప్రాజెక్టులో కీలకమైన దశగా టెండర్ల పరిశీలన, తుది సంస్థ ఎంపిక నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News