Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

లడ్డూ ప్రసాదం ఇక ఏటీఎంలోనే!

Nagamani Malligari September 23, 2026prabhanews.com

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సాంకేతిక సేవలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం సరికొత్త సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం స్వయంచాలక విక్రయ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కొండ దిగువన అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని దేవాదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె.శీనా నాయక్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదం కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ సాంకేతిక సదుపాయం దోహదపడుతుందని కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ తెలిపారు. యూపీఐ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసి స్వయంగా క్షణాల్లో ప్రసాదం పొందేలా యంత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పైలట్‌ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకొచ్చామని, పనితీరును పరిశీలించిన అనంతరం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఉత్సవాలు, రద్దీ రోజులతో పాటు సాధారణ రోజుల్లోనూ ఈ యంత్రం భక్తులకు ఉపయోగపడుతుందని కమిషనర్‌ పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థలో సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో అధిక శాతం సేవా టికెట్లను భక్తులు సులభంగా బుక్‌ చేసుకుంటున్నారని వివరించారు.

దర్శనాలు, సేవల పేరిట దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని దేవాదాయశాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు. విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పూజా టికెట్ల వ్యవహారంపై దేవస్థానం అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భక్తులు అపరిచితులు, మధ్యవర్తులను నమ్మి పూజా టికెట్ల పేరుతో మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం, దేవస్థానం అధికారికంగా నిర్వహించే వెబ్‌సైట్లు, డిజిటల్‌ యాప్‌లు, అధీకృత కౌంటర్ల ద్వారా మాత్రమే సేవలను పొందాలని కోరారు.

ఇంద్రకీలాద్రిపై రాబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని రామచంద్ర మోహన్‌ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో సామాన్య భక్తులకే అగ్రతాంబూలం కల్పించే దిశగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ప్రసాద వితరణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.

ఎండ, వర్షాల నుంచి భక్తులకు రక్షణ కల్పించేలా షెడ్ల నిర్మాణం, నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్‌ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News