Abhi Naga August 31, 2026prabhanews.com
పాలిటెక్నిక్ విద్యను పాత విధానంలోనే కొనసాగించాలి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన జీఓ 97, శక్తి పథకాన్ని రద్దు చేసి పాత విధానంలోనే విద్య కొనసాగించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జీఓ 97, శక్తి పథకాన్ని రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దాదాపు 80 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యగా దీనిని చూడాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలను కొనసాగించాలని, వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే మార్పులు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ఇంజనీర్లుగా ఎదిగే అవకాశాలు ఉండాలి
పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసిన విద్యార్థులు తదుపరి ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లుగా ఎదిగే అవకాశాలు పొందుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులను కేవలం కార్మిక శక్తిగా తయారుచేసే విధానాల కంటే.. సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసే విధానాలు అవసరమన్నారు. డిప్లొమా తర్వాత ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశించే అవకాశం కొనసాగించాలని కోరారు. అనంతరం బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు.
ఐటీఐలకు పరిశ్రమల అనుసంధానం
ఐటీఐ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సూచించారు. ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేసి విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని కోరారు. శిక్షణ అనంతరం శిష్యరికం ద్వారా పరిశ్రమల్లో అనుభవం కల్పించి, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాంకేతిక విద్యను ఉద్యోగ మార్కెట్‌కు అనుసంధానం చేయడం ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.
59 పాలిటెక్నిక్ కళాశాలలను కాపాడాలి
రాష్ట్రంలో 59 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, విశాలమైన మైదానాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కో కళాశాలకు సుమారు 20 నుంచి 30 ఎకరాల వరకు భూమి ఉన్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములను ఇతర అవసరాలకు వినియోగించే ఆలోచన ఉంటే ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
రూ.14 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.14 వేల కోట్ల మేర ఉన్నాయని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మొత్తాలను వెంటనే విడుదల చేసి విద్యార్థులు, కళాశాలలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బలహీనపరిచే చర్యలు కాకుండా గతంలో అమలైన విధానంలోనే కొనసాగించాలని కోరారు. ఉన్నత విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కీలకమని అన్నారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
పాలిటెక్నిక్ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించి దశలవారీగా నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాకేశ్ దత్త, జయంత్ యాదవ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
