Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
భైంసా, ఆంధ్రప్రభ: మహారాష్ట్రలో సోమవారం జరిగిన జీపు ప్రమాదంలో పార్డి (బి) గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ పరామర్శించారు.
ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో భైంసా ఏరియా ఆసుపత్రితో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ముందుగా పోస్టుమార్టం గదికి వెళ్లిన ఎమ్మెల్యే మృతదేహాలను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించారు.
అనంతరం డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జీడీఆర్ ఆసుపత్రి, వెంకటేశ్వర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
