Bharath September 2, 2026prabhanews.com
- 278 మంది వితంతు మహిళలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం
- 13 మందికి జనరేటర్లు, టూల్ కిట్లు
- తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
రంగారెడ్డి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మైనారిటీ లబ్ధిదారులకు ఆర్థిక సాయం, జీవనోపాధి పరికరాలను ఆయన పంపిణీ చేశారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' కింద 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా మహిళలు చిన్నతరహా వ్యాపారాలు లేదా ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకుని తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
13 మందికి జనరేటర్లు, టూల్ కిట్లు
'మైనారిటీ కమ్యూనిటీకి తుర్క కాశా పునరావాసం' పథకం కింద 13 మంది తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను అందించారు. వీటిని ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందాలని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు, పారిశ్రామిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని అజహరుద్దీన్ తెలిపారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను మహిళలు, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లు తదితర ప్రభుత్వ ప్రోత్సాహకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మైనారిటీ మహిళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.మదీనా బస్సు అగ్నిప్రమాద ఘటన అనంతరం బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తుచేశారు. అలాగే హజ్ ఏర్పాట్లకు రూ.7 కోట్లు మంజూరు చేయడం ద్వారా మైనారిటీ సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
"కుట్టు మిషన్లతో నాకు ప్రత్యేక అనుబంధం"
కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి పంచుకున్నారు. చిన్నప్పుడు తన తల్లి తనకు దుస్తులు కుట్టి ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కుట్టు మిషన్లు ఆధునిక సదుపాయాలతో సులభంగా వినియోగించుకునేలా ఉన్నాయని చెప్పారు.తన క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ.. "నేను టెస్ట్ ప్లేయర్‌ను.. నిధుల కోసం నాయకులు చేసే డిమాండ్ల విషయంలో కూడా సెంచరీ కొడతా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
యువతకు నైపుణ్యాలు.. ఉపాధిపై దృష్టి
యువత స్వయం ఆధారితంగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పాతబస్తీ యువతకు కమ్యూనిటీ పెద్దలు, నాయకులు సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఉత్పాదక కార్యక్రమాల వైపు యువతను ప్రోత్సహించాలని అన్నారు. "చేపలు ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పించాలి. అప్పుడు వారు తమకు తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా అండగా నిలబడగలరు" అని మంత్రి పేర్కొన్నారు.
పదవిలో ఉన్నంతకాలం ప్రజల కోసం పనిచేస్తా
తనకు రాజకీయాల్లో, క్రికెట్ కెరీర్‌లో ప్రజల మద్దతు ఎంతో కీలకమైందని మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పదవిలో ఉన్నంతకాలం ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సెరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, అదనపు కలెక్టర్ కిరణ్మయి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, TGMFC అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
