Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మతాలు వేరైనా మనమంతా ఒకటే..

Sowjanya Anneboina August 29, 2026prabhanews.com

మానవత్వం చాటిన ముస్లిం మైనారిటీ సభ్యులు

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని చాటుతూ మంచిర్యాల పట్టణంలోని ముస్లిం మైనారిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన అచ్యుత లక్ష్మి శనివారం మృతి చెందారు. ఆమెకు వారసులు ఎవరూ లేకపోవడంతో ముస్లిం మైనారిటీ సభ్యులు ముందుకు వచ్చి హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి మంచిర్యాల పట్టణానికి వ్యాపారం కోసం అచ్యుత లక్ష్మి కుటుంబం వచ్చింది.

రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఫారెస్ట్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ భవనంలో మైత్రి ఎయిర్‌ కండిషనర్‌ సర్వీసింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. వారికి సంతానం లేకపోవడంతో తమ వద్ద పనిచేసిన యువకుడు మహమ్మద్‌ ముజామిల్‌ ఇఫ్తార్‌ను సొంత బిడ్డలా భావించి తల్లిగా ప్రేమించారు. అచ్యుత లక్ష్మి, మహమ్మద్‌ ముజామిల్‌ మధ్య ఏర్పడిన అనుబంధం మతాలకు అతీతమైన మానవ సంబంధానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు తెలిపారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న స్థానిక బీజేపీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ గాజుల ముఖేష్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అబ్దుల్‌ సత్తార్‌, కార్పొరేటర్‌ కిషన్‌, షాయకాలి, ముజాహిద్‌, మహమ్మద్‌ సాదిక్‌ తదితరులు ముందుకు వచ్చారు.

పాడెను మోసి హిందూ సంప్రదాయ పద్ధతిలో వైకుంఠధామం వరకు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు, యువకులు పాల్గొన్నారు. మతసామరస్యం, సోదరభావం, మానవత్వానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని పలువురు పేర్కొన్నారు. మతం మనుషులను వేరు చేయవచ్చేమో కానీ మానవత్వం అందరినీ ఏకం చేస్తుందని వారు తెలిపారు. అచ్యుత లక్ష్మికి వారసులు లేకపోయినా, ఆమె అంతిమ సంస్కారాలను తమ బాధ్యతగా భావించి నిర్వహించడం మతసామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచిందని స్థానికులు అన్నారు. ఈ ఘటన మంచిర్యాల చరిత్రలో గుర్తుండిపోతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News