Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మునుగోడులో వైద్య రంగానికి భారీ ఊతం

Madhav August 4, 2026prabhanews.com

ప్రజలకు మెరుగైన వైద్యం… ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌కు శ్రీకారం

​ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రుల సమగ్ర అభివృద్ధి, వైద్య సేవల మెరుగుదలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియట్‌ లోని తన చాంబర్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గం లోని ఆరోగ్య కేంద్రాల బడ్జెట్ పెంపుతో పాటు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం లో సబ్ సెంటర్లు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సిబ్బంది, సాంకేతిక పరికరాలు, నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

​చౌటుప్పల్ ఏరియా హాస్పిటల్ పనులు నెలాఖరుకల్లా పూర్తి చేయాలి

చౌటుప్పల్ పట్టణంలో చేపట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చేసి, సెప్టెంబర్‌లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్, ట్రామా కేర్ సెంటర్‌లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.

​జాతీయ రహదారి-65పై ట్రామా కేర్:
ఎన్‌హెచ్-65పై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడేందుకు చౌటుప్పల్ ప్రాంతంలో అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ సెంటర్ అత్యంత ఆవశ్యకమని ఎమ్మెల్యే విన్నవించారు.

​ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్: మునుగోడు, నాంపల్లి పిహెచ్‌సిలను 30 పడకల ఆసుపత్రులుగా, మర్రిగూడ సిహెచ్‌సిని 30 నుంచి 50 పడకలకు పెంచాలని, చండూరు రెవిన్యూ కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం మంజూరు చేయాలని కోరారు.

​బడ్జెట్ పెంపుకు మంత్రి సానుకూలత: మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు బడ్జెట్ పెంచాలని చర్చించారు. ​ఎమ్మెల్యే ప్రతిపాదనలపై మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు, నియోజకవర్గంలో వైద్య సేవలను పూర్థిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ​ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డిఎంఇ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, నల్గొండ డిఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్, డిసిహెచ్ మాతృ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మనోహర్, డిసిహెచ్ సూర్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News