Abhi Naga August 30, 2026prabhanews.com
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- రూ.3.74 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు.. సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
హుస్నాబాద్, ఆంధ్రప్రభ: హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న "పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లెలో ప్రజా పాలన" కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా ఆయా గ్రామాలు, తండాల మధ్య రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
ముత్తారం గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సామాజిక భద్రత పెన్షన్లు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు రుణాలు తదితర సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, ఆయిల్‌పామ్ సాగు, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంకుల వినియోగాన్ని పెంచాలని ప్రజలకు సూచించారు.
విద్య, క్రీడలకు ప్రోత్సాహం
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. యువత క్రీడల్లో రాణించేలా అవసరమైన క్రీడా సామగ్రి, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముత్తారం గ్రామానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి చేపడతామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి ముత్తారం గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
