Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
ఉట్నూర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో నర్స్ శిరీషను దారుణంగా హత్య చేసిన నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుని, చట్ట ప్రకారం శిక్ష విధించాలని ఏఐబీఎస్‌ఎస్ అఖిల భారతీయ బంజారా సేవా సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భీమ్రావు రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలందించే నర్స్ శిరీష హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని అన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని భీమ్రావు రాథోడ్ కోరారు.
అదేవిధంగా శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
