Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరణే ఉద్యోగుల ప్రధాన డిమాండ్
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.యం.
చంద్రకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎస్ అమలు దినాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కె.యం. చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రాఘవేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్, మల్లేష్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎస్ అమలై 22 సంవత్సరాలు పూర్తవుతున్నా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి ఈ నిరసనల ద్వారా తెలియజేశామని పేర్కొన్నారు.
గత ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరై పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై తమ ఆకాంక్షను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారని నాయకులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 17న సామూహిక సెలవు
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నవంబర్ 17వ తేదీని 'మేనిఫెస్టో డే'గా పాటిస్తూ ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. ఇప్పటి నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కోరారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు భాగస్వామి కావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 17న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉద్యోగుల ఐక్యతను, పాత పెన్షన్ విధానంపై ఉన్న బలమైన ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
