Sowjanya Anneboina August 30, 2026prabhanews.com
వరంగల్ మహాసభను విజయవంతం చేయాలి
దండేపల్లి, ఆంధ్రప్రభ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీని సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో ఎన్నుకోనున్నట్లు మండల బాధ్యులు తెలిపారు.
ఆదివారం దండేపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబరు 9న వరంగల్‌లో నిర్వహించనున్న నూతన మండల కమిటీల జాతీయ స్థాయి మహాసభను విజయవంతం చేయడంలో భాగంగా మండల కమిటీ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల యువసేన నాయకులు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై తమ సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సాధన, సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి జిల్లా బాధ్యులు లింగంపెల్లి శ్రీనివాస్ మాదిగ, మంచిర్యాల నియోజకవర్గ బాధ్యులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని మండల బాధ్యులు తగరపు సత్యం మాదిగ, మల్యాల శ్రీనివాస్ మాదిగ, బచ్చల అంజన్న మాదిగ, నాతరి రమేష్ మాదిగ, ఆవుల శ్రీనివాస్ మాదిగ, బచ్చల సుభాష్ మాదిగ, కొల్లూరి రమేష్ మాదిగ కోరారు.
