Bharath September 2, 2026prabhanews.com
సోనూ సూద్ అంటే సినిమాల్లో విలన్ పాత్రలతోనే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
కరోనా సమయంలో వలస కార్మికులకు చేసిన సాయం నుంచి అత్యవసర వైద్యం, విద్య, విపత్తు సహాయక చర్యల వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అవసరంలో ఉన్న పలువురికి వైద్య సాయం, ఆర్థిక సహకారం అందిస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. అయితే ఇప్పుడు నేపాల్ వరద బాధితులకు అండగా నిలిచేందుకు సోనూసూద్ కదిలారు. తనే స్వయంగా కాఠ్మాండ్ చేరుకొని బాధితులకు సాయం అందిస్తున్నారు.
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు నటుడు సోనూ సూద్ అండగా నిలిచాడు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సోనూ సూద్ ఆధ్వర్యంలో 'సూద్ చారిటీ ఫౌండేషన్' బృందం కాఠ్మాండ్ చేరుకున్నారు.
ఈ సందర్బంగా సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, అవసరాలకు అనుగుణంగా మరింత సహాయక సామగ్రిని అందజేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా నేపాల్ వరద బాధితులకు తమ సంస్థ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
"వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలను కలవడానికి ఇక్కడికి వచ్చాం. భారత్ నుంచి ఆహార పదార్థాలు, దుప్పట్లు, అవసరమైన సామగ్రిని తీసుకొచ్చాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం మనందరి బాధ్యత" అని సోనూ సూద్ పేర్కొన్నారు.
కష్టకాలంలో ముందుండే సోనూ సూద్
ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడం సోనూ సూద్‌కు కొత్తేమీ కాదు. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు ముంబైలో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఆయన ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు అందించేందుకు కృషి చేశారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు కూడా సహాయం అందించారు.
సోనూ సూద్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం, అవసరమైన వారికి ఉచిత వైద్య చికిత్సలు, ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. విపత్తు ఏదైనా ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
నేపాల్ వరద బాధితుల కోసం ప్రస్తుతం చేపట్టిన ఈ సహాయక చర్యలు మరోసారి ఆయన సేవా భావాన్ని చాటుతున్నాయి. బాధితులకు అవసరమైన సాయం అందే వరకు తమ ఫౌండేషన్ పనిచేస్తుందని సోనూ సూద్ తెలిపారు.
