Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నిరుద్యోగంతో అభివృద్ధి కొనసాగేనా? జీడీపీ వృద్ధి-ఉద్యోగాల మధ్య పెరుగుతున్న అంతరం

Rama Rao August 6, 2026India Unemployment, Jobless Growth

నిరుద్యోగంతో అభివృద్ధి కొనసాగేనా? జీడీపీ వృద్ధి-ఉద్యోగాల మధ్య పెరుగుతున్న అంతరం

  • ఉద్యోగ హామీలు.. వాస్తవ పరిస్థితులపై ప్రశ్నలు
  • ప్రభుత్వ రంగం క్షీణత, ప్రైవేటీకరణ ప్రభావం
  • జీడీపీ పెరుగుదలతో ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు?
  • ఆదాయ అసమానతలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి
  • ప్రజా శ్రేయస్సు కోసం సమ్మిళిత అభివృద్ధి అవసరం

నేటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకమునకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉండగా, 60 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా కూడా వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటివి నిరుద్యోగులను వెక్కిరిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పెట్టుబడులు కార్పొరేట్లకే లాభిస్తున్నాయి. వాళ్ల కోసమే లేబర్ కోడ్స్ రూపొందించగా ప్రభుత్వరంగంలో కొత్త రిక్రూట్మెంట్లు లేవు. డిజిటల్ పేరిట ఉద్యోగాలు రద్దు అవుతున్నాయి.

నీతిఆయోగ్ ప్రకారం రోజుకు 25 ప్రభుత్వ స్కూళ్ల చొప్పున మూసివేస్తూ 2014-2024 మధ్యకాలంలో 94,000 బడుల తలుపులకు తాళం వేశారు. ఇదే కాలంలో ప్రైవేట్ స్కూల్స్ 3.5 లక్షలు పెరిగాయి. అంతా ప్రైవేట్ పరం. ఈ విధానాలపై యువతలో, నిరుద్యోగుల్లో అసహనం తీవ్రం అవుతోంది.

మన పాలకులు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులతో దేశాభివృద్ధి జరగాలని భావించి ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి కార్యక్రమాలన్నీ మానేసి వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారీ కనుసన్నల్లో ఉన్నందున దేశ సంపద కొందరిదిగా అయిపోతున్నది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతున్నది.

2013లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 17.3 లక్షల ఉద్యోగాలు ఉండగా 2022 నాటికి 10 లక్షలకు తగ్గిపోయాయి. అందులోనూ కాంట్రాక్టు కార్మికులుగా 43 శాతం మందికి నియామకాలు జరిగాయి. ఇలా దేశంలో మెల్లగా ప్రైవేటు రంగం విస్తరించి కార్పొరేట్ రంగానికి పునాదులు బలంగా ఏర్పడడంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

35 ఏళ్ల లోపు భారతీయులలో 65 శాతం నిరుద్యోగిత ఉన్నది. పట్టభద్రులలో 40 శాతం, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 80 శాతం నిరుద్యోగం తాండవించుచున్నది. ఫలితంగా ఆదాయ అసమానతలు కనీవిని ఎరగని రీతిలో ఉన్నాయి.

టాప్ టెన్ పర్సెంట్ ప్రజల వద్ద 77 శాతం సంపద ఉండగా, క్రింది 50 శాతం ప్రజల వద్ద కేవలం 4.1 శాతం ఆదాయం మాత్రమే ఉంది.

బిలియనీర్ల పెరుగుదలకు జీడీపీ పెరుగుదలకు సంబంధం ఉంటుంది గాని, నిరుద్యోగ నిర్మూలనకు సంబంధం లేదని మన పాలకులకు తెలియదా? మన దేశంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల అందరినీ కలుపుకొనిపోయే విధంగా సమ్మిళిత వృద్ధిగా జరగలేదు.

నేడు దేశంలో 50 శాతం జనాభా ఈ జీడీపీ పెరుగుదలకు దూరంగా ఉన్నారని, అందరికీ తెలిసిన మన పాలకులు దీనిని పట్టించుకోక, ఎంతసేపు జీడీపీ పెరుగుదలనే కొలమానంగా భావించి దేశ ఆర్థిక అభివృద్ధి జరిగిపోతున్నదని భావిస్తున్నారు.

1980-1990 మధ్యకాలంలో పెరుగుతున్న జీడీపీ రేట్లు ప్రతి ఒక్క పాయింట్ పెరిగిన శాతానికి రెండు లక్షల ఉద్యోగాలు సంఘటిత రంగంలో పెరిగాయని ఆనాడు ఆర్బీఐ తెలిపింది. 1990-2000 మధ్యకాలంలో ఉద్యోగాల పెరుగుదల రేటు జీడీపీ పెరుగుదల రేటుకు సగానికి పడిపోయింది. 2000-2010 మధ్యకాలంలో ఒక శాతం జీడీపీ పెరుగుదల రేటుకు 52,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. ఇలా వరుసగా సగానికి సగం ఉద్యోగాల పెరుగుదల రేటు తగ్గిపోతున్నది కాబట్టి జీడీపీ పెరుగుదల రేటు ప్రజా శ్రేయస్సు సూచిక కాదు.

గాంధీజీ ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. పరిపాలన విధానాలు చట్టాల ద్వారా అందరికీ క్షేమం అందించేదే రాజ్యం. పరిపాలన ఎలా చేయాలనేది ముఖ్యం.

స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో భారత ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు స్థాపించి తద్వారా ఉత్పత్తులను, ఉద్యోగ కల్పన పెంచాలని తలపెట్టి సఫలీకృతమైంది. నేడు అదే సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడాన్ని పెట్టుబడి అంటున్నారు.

1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలో 5062 విదేశీ కంపెనీలు ఉన్నాయి. వారి దప్పిక తీరలేదు అన్నట్లు ప్రైవేటీకరణ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. 2017-18 వరకు 3,47,439 కోట్ల మేరకు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారు.

77 ఏళ్ల స్వాతంత్య్రంలో భారతదేశం పరాధీన భారతంగా మారే తీరుఇదేనేమో! నూతన ఆర్థిక విధానాలు చేపట్టేటప్పుడు మన దేశంలో ఒకే ఒక బిలియనీర్ ఉండగా నేడు 309 మందికి పెరిగినారు. వీరు కోట్లల్లో రాయితీలు తీసుకుంటూ వందల్లో కూడా కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేకున్నారు.

సమాజ శ్రేయస్సు లేని ఆర్థిక వృద్ధి ఎప్పటికీ అసంపూర్ణమే. నిరుద్యోగంతో, ఆదాయ అసమానతలతో కూడుకున్న ఆర్థికవృద్ధి కొనసాగలేదు. మానవత్వాన్ని విస్మరించిన ఆర్థికవృద్ధి సమాజానికి శాపంగా మారుతుంది.

ప్రభుత్వాలు యువతను విస్మరిస్తే పాలకులకే ప్రమాదం. ముఖ్యంగా ఇది ఆన్లైన్ కాలము. యునెస్కో ప్రకారం సోషల్ మీడియా యువతను ఎక్కువగా సామాజిక సమస్యలపై దృష్టి పెట్టేదిగా ఉన్నదని తెలియజేస్తున్నది.

మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దానిని కాపాడుకోవడం ప్రజల చేతుల్లో ఉంది. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో భాగము. ఇటువంటి నిరసనలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో కాలమే నిర్ణయించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలిపిన నిరసన ప్రపంచ దేశాల్లోని యువతకు ఆదర్శం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News