Sowjanya Anneboina August 22, 2026prabhanews.com
ఫోటోగ్రఫీ దినోత్సవంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఒక్క ఛాయాచిత్రం వేయి భావాలను పలికిస్తుందని డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు ఫోటో జర్నలిస్టులకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఒక ఫోటోతో గత జ్ఞాపకాలు మనసులో మెదులుతాయని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో ఛాయాచిత్రాలను ఎండనక, వాననక వృత్తి పట్ల అంకితభావంతో ఫోటో జర్నలిస్టులు చిత్రీకరిస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఫోటో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తనకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. చిన్నతనంలో రీల్ కెమెరాలతో ఫోటోలు తీసి, అనంతరం ఫోటో ల్యాబ్‌కు వెళ్లి వాటిని ముద్రించుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితంలో కొన్ని ఛాయాచిత్రాలు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని అన్నారు.
ఒకే ఫోటోను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారని, ఒక్క ఛాయాచిత్రం ద్వారా ప్రజల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ కదలిక తీసుకురాగల సందర్భాలు ఎన్నో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. నేటి కాలంలో వార్తాపత్రికల్లో ఫోటోకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వార్త చదివే ముందు చాలామంది ముందుగా ఫోటోను చూసి దాని ప్రాధాన్యతను అంచనా వేస్తున్నారని తెలిపారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఛాయాచిత్రాల ద్వారా అందించాలని ఫోటో జర్నలిస్టులను కోరారు.
ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలోని చిత్రాలను చూస్తుంటే గతంలో జరిగిన అనేక సంఘటనలు కళ్లముందు కనిపించాయని అన్నారు. వెయ్యి పదాలు చెప్పలేని విషయాన్ని ఒక్క ఫోటో ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెబుతుందని పేర్కొన్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధి ఎం.ఏ.కే. పైసల్, బండారు యాదగిరి, రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్ మాట్లాడుతూ ఫోటో జర్నలిజంలో వస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఫోటో జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను అతిథులు, జర్నలిస్టులు, విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, కౌన్సిలర్ జగన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, టీజీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, జిల్లా ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మురళీ, ఫోటో జర్నలిస్టులు పవన్, సోమ సాయిచంద్, కృష్ణ, సతీష్, సంతోష్, హరి, రాజ్ కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
