Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఓటు హక్కు భద్రతకు నోటీసులు.. అనుమానాలు వద్దు

Rama Rao September 1, 2026Telangana

నాంపల్లి, ఆంధ్రప్రభ: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఓటరు జాబితాల్లో దొర్లిన పొరపాట్లను సరిచేసేందుకు కొంతమంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ అంబటి ఆంజనేయులు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు వాటి వెనుక భాగంలో సూచించిన విధంగా తగిన ఆధారాలను సమర్పించి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవచ్చని సూచించారు. ఓటరు జాబితాల నుంచి ఓటు హక్కును తొలగించేందుకు నోటీసులు జారీ చేయలేదని, కేవలం జాబితాల్లోని పొరపాట్లను సరిదిద్దేందుకు మాత్రమే నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ, గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరిలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నోటీసులు అందుకున్న వారి ఓటు హక్కును తొలగిస్తారంటూ కొంతమంది తెలిసీ తెలియని సమాచారంతో ఓటర్లలో అనుమానాలు పెంచుతున్నారని అన్నారు. ఎవరి ఓట్లు తొలగించాలనే ఉద్దేశం ఎన్నికల కమిషన్‌కు లేదని, కేవలం జాబితాల్లోని తప్పులను సరిచేయడంతోపాటు మృతి చెందిన వారి పేర్లు ఉంటే వాటిని మాత్రమే తొలగిస్తామని వివరించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ సంబంధిత ఆధారాలను సమర్పించి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ గ్రామసభలో రెవెన్యూ శాఖ అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News