Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యం.. వివక్షకు తావులేదు
ప్రతిరోజూ ఓ వార్డు సందర్శించి సమస్యలు తెలుసుకుంటా: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి
నల్లగొండ, ఆంధ్రప్రభ: నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లను పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలని, ఆ తర్వాత ప్రజా సమస్యలు, అభివృద్ధే ప్రధానమని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో నల్లగొండ నగరపాలక సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏ డివిజన్‌పై తనకు వివక్ష లేదని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ ఒక వార్డును సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ తెలిపారు. కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో కోట్ల రూపాయలతో మిగిలిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి లేదా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
