Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పాశమైలారంలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు !

Pavan Chandragiri October 24, 2026

  • పరిశ్రమ ముసుగులో మాదకద్రవ్యాల తయారీకి రసాయనాల సరఫరా
  • ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ మెరుపు దాడులతో వెలుగులోకి అక్రమ దందా
  • పటాన్‌చెరు పోలీసుల సహకారంతో పరిశ్రమలో సోదాలు
  • రూ.27 లక్షల విలువైన రసాయనాలు, ప్రయోగశాల పరికరాలు స్వాధీనం
  • పరిశ్రమ నిర్వాహకుడు రమేష్‌ బాబు సాకే అరెస్టు
  • గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణకు విస్తరించిన నెట్‌వర్క్‌
  • పారిశ్రామిక ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘా ఏదీ?
  • అంచనా వేయడంలో స్థానిక అధికారుల వైఫల్యమే కారణం

సంగారెడ్డి ప్రతినిధి, పటాన్‌చెరు, (ఆంధ్రప్రభ) :

పరిశ్రమల ముసుగులో సాగుతున్న అక్రమ మాదకద్రవ్యాల దందా సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో వెలుగుచూడటం కలకలం రేపుతోంది. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ పేరుతో మాదకద్రవ్యాల తయారీకి అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించిన మహారాష్ట్రలోని మీరా భయందర్‌-వసాయ్‌ విరార్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు పాశమైలారంలోని ఓ పరిశ్రమపై మెరుపు దాడులు నిర్వహించారు. అక్టోబర్‌ 21న జరిగిన ఈ దాడులకు సంబంధించిన వివరాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. స్థానిక పటాన్‌చెరు పోలీసుల సహకారంతో చేపట్టిన సోదాల్లో సుమారు రూ.27 లక్షల విలువైన రసాయన పదార్థాలు, ప్రయోగశాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ నిర్వాహకుడిగా పేర్కొన్న రమేష్‌ బాబు సాకేను అరెస్టు చేశారు.

తీగ లాగితే కదిలిన డ్రగ్స్‌ డొంక !

మహారాష్ట్రలో ప్రారంభమైన మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ మీదుగా తెలంగాణకు చేరుకోవడం సంచలనంగా మారింది. మీరా భయందర్‌-వసాయ్‌ విరార్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్‌-4 అధికారులు గతంలో అరెస్టు చేసిన నిందితులను విచారించగా, మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే రసాయనాల సరఫరా వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని ఐడీఏ పాశమైలారంలో కొనసాగుతున్న రసాయన తయారీ కేంద్రంపై పోలీసులు దృష్టి సారించారు. అక్టోబర్‌ 21న ప్రత్యేక బృందాలు పరిశ్రమలో సోదాలు నిర్వహించి, మెఫెడ్రోన్‌ అనే సింథటిక్‌ మాదకద్రవ్యం తయారీకి ఉపయోగించే రసాయనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. పరిశ్రమ నిర్వాహకుడు రమేష్‌ బాబు సాకే మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందిన వ్యక్తిగా సమాచారం.

రూ.27 లక్షల విలువైన రసాయనాలు స్వాధీనం

పాశమైలారంలోని పరిశ్రమలో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.27 లక్షల విలువైన రసాయన పదార్థాలు, ఇతర ముడి రసాయనాలు, ప్రయోగశాల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం పరిమాణం సుమారు 44.699 కిలోలుగా ఉన్నట్లు సమాచారం. ఈ రసాయనాలు మాదకద్రవ్యాల తయారీకి వినియోగిస్తున్నారా, వాటిని ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల మధ్య విస్తరించిన నెట్‌వర్క్‌!

ఈ కేసు దర్యాప్తులో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విస్తరించిన రసాయనాల సరఫరా నెట్‌వర్క్‌ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తం కేసులో ఇప్పటివరకు 25 మంది అరెస్టయినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ సంఖ్యకు సంబంధించిన అధికారిక నిర్ధారణ అవసరం. పాశమైలారం పరిశ్రమలో లభించిన రసాయనాల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారా? ఈ అక్రమ కార్యకలాపాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది.

పారిశ్రామిక ప్రాంతాల్లో నిఘా ఏదీ?

పాశమైలారం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల పేరుతో అనుమానాస్పద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానాలు ఈ ఘటనతో వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల్లో వినియోగించే రసాయనాల నిల్వలు, కొనుగోళ్లు, విక్రయాలు, సరఫరాలపై సంబంధిత శాఖల పర్యవేక్షణ ఎంతవరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారా? ముందస్తు తనిఖీలు, నిఘా వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయా? అనే అంశాలపై సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News