Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
- 20 ద్విచక్ర వాహనాలకు జరిమానా
చిట్యాల,ఆంధ్రప్రభ: చిట్యాల మండలంలోని పాశిగడ్డ తండాలో ఆదివారం పోలీసులు ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
చిట్యాల సీఐ వై. సతీష్ ఆదేశాల మేరకు ఎస్సై పోచంపల్లి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తండాలో వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించారు. అదేవిధంగా లావుడియా వినోద అనే మహిళ వద్ద 5 లీటర్ల నిషేధిత గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు.
గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు
పాశిగడ్డ తండాపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్సై తెలిపారు. తండాలో ఎవరైనా నిషేధిత గుడుంబాను తయారు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సెకండ్ ఎస్సై ఓంపాల్తో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
