Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
పంచాయతీ సిబ్బంది, పాఠశాల వంట సిబ్బందికి సొంత ఖర్చుతో దుస్తులు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుమల శ్రీనివాస్ ఇటీవల పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) మాట్లాడుతూ గత మూడేళ్లుగా చేంగల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను నేర్పి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయుడు తిరుమల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన పదవీ విరమణతో పాఠశాల నుంచి వెళ్లిపోతుండటంతో విద్యార్థులు, గ్రామస్థులు భావోద్వేగానికి గురై వీడ్కోలు పలికినట్లు చెప్పారు.
పదవీ విరమణ అనంతరం కూడా తన సేవాభావాన్ని చాటుకున్న ప్రధానోపాధ్యాయుడు తిరుమల శ్రీనివాస్.. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు పాఠశాలలో వంట చేసే సిబ్బందికి సొంత ఖర్చుతో కొత్త దుస్తులను అందజేశారు. ఆయన చూపిన ఆదరణ, సేవాభావాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు), ఉప సర్పంచ్ నాతి మోహన్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి వినయ్, కారోబార్ చందు, ఏఎంసీ డైరెక్టర్ నరసాపురం జీవన్, విద్యార్థులు, గ్రామస్థులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
