Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పల్లె పల్లెకు పొన్నం.. ప్రజల వద్దకే పాలన

Sowjanya Anneboina August 29, 2026prabhanews.com

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు..
సూరారానికి ఆర్టీసీ బస్సు, అభివృద్ధి పనులకు హామీలు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెల్లో ప్రజా పాలన' కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంక్షేమ పథకాలతో సూరారానికి భారీ లబ్ధి

ప్రజా పాలనలో సూరారం గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామంలో 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 475 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. పెన్షన్ల కోసం రూ.1.11 కోట్లు విడుదలవుతున్నాయని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 665 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి రూ.63.96 లక్షల మేర లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 535 కుటుంబాలకు రూ.10.08 లక్షలు విడుదలయ్యాయని తెలిపారు.

71 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.50.92 లక్షలు అందించగా, 71 మహిళా సంఘాలకు బ్యాంకు అనుసంధానం కింద రూ.10.37 కోట్లు విడుదలయ్యాయని మంత్రి వివరించారు. 340 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద రూ.2.87 కోట్లు విడుదలయ్యాయని, 973 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.4.83 కోట్లు అందాయని తెలిపారు. ఎనిమిది మంది రైతు కుటుంబాలకు రైతు బీమా కింద రూ.40 లక్షలు అందించామని చెప్పారు. 217 మంది రైతులకు ధాన్యం బోనస్ కింద రూ.62.18 లక్షలు విడుదలయ్యాయని, 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఐదుగురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందించామని పేర్కొన్నారు. మహిళలకు 1,022 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని తెలిపారు.

సూరారానికి ఆర్టీసీ బస్సు మంజూరు

సూరారానికి ఆర్టీసీ బస్సు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ నీలా కొమురయ్యతో పాటు ప్రజలు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సూరారం మీదుగా హుజూరాబాద్‌-హనుమకొండ మధ్య బస్సు నడిపించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో బస్సు సర్వీసును ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సూరారం గ్రామంలో విద్యుత్ సరఫరా, తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కొత్త కాలనీలకు విద్యుత్ స్తంభాలు, అంగన్వాడీ భవనాలు తదితర సమస్యలను సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సూరారం-పోలాడ్‌పల్లి మధ్య వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, సూరారం నుంచి వీరనారాయణపూర్ వరకు రహదారి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామంలో ఇప్పటికే సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

పెన్షన్లకు ఈనెల 31 వరకు దరఖాస్తులు

కొత్త పెన్షన్ల కోసం ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, తలసేమియా, హెచ్‌ఐవీ బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని సూచించారు.

ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి

ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లో స్టీల్ బ్యాంకులను వినియోగించాలని కోరారు. సూరారం గ్రామంలో మూడు మహిళా సంఘాలకు 400 చొప్పున మొత్తం 1,200 స్టీల్ బ్యాంకు కిట్లు అందించామని చెప్పారు. గ్రామంలోని ఓటర్లకు ఒక్కొక్కరికి 100 స్టీల్ గ్లాసులు అందించామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు. 14-15 సంవత్సరాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. యువత మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో ఇప్పటికే కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేశామని, సూరారం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

రేషన్ కార్డులకు పైరవీలు అవసరం లేదు

గతంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. సూరారం గ్రామంలో 150 రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు 1,230 పేర్లను కొత్తగా చేర్చామని వెల్లడించారు. రేషన్ కార్డుల కోసం ఎలాంటి పైరవీలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందుతాయని స్పష్టం చేశారు.

ఓటు హక్కును కాపాడుకోవాలి

గ్రామంలో సుమారు 500 ఓట్లు తటస్థంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలని సూచించారు. తన ఓటు కూడా తటస్థ ఓటుగా నమోదై నోటీసు వచ్చిందని, తన తండ్రి పేరు సత్తయ్యకు బదులుగా సత్యనారాయణగా నమోదైందని మంత్రి తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.

గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు అశోక్‌రెడ్డి, ముప్పు మహేందర్, డాక్టర్ రమేష్, జెడ్పీసీఈఓ గురవయ్య, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ నీలా కొమురయ్య, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News