Nagamani Malligari October 24, 2026prabhanews.com
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : పండుగల వేళ ఉద్యోగులు సమ్మె చేయడం బాధాకరమని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి టి.
జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఉద్యోగులు న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సమయంలో ఉద్యోగులు సమ్మె చేయడం బాధాకరమన్నారు. సమ్మె ముగుస్తుందని భావించినా కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వైద్య సేవలు రాజ్యాంగబద్ధమైన హక్కు అని, పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్‌లో జననీ శిశు సంరక్షణ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అందించేదని, ప్రస్తుతం అవి కనిపించడం లేదని విమర్శించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించలేక కేంద్ర నిధులకు ఆటంకం కలిగిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఎన్‌హెచ్‌ఎంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు, వైద్య సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా మంత్రి, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా, ఉద్యోగులతో రూ.8 వేలకే పనిచేయించడం దారుణమన్నారు. ఫస్ట్ ఏఎన్‌ఎం, సెకండ్ ఏఎన్‌ఎం ఒకే విధమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా వేతనాల్లో ఆకాశానికి, నేలకు ఉన్నంత తేడా ఉందన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఉద్యోగులను పండుగ వేళ రోడ్డున పడేయడం సరికాదన్నారు. ఎల్‌నినో కారణంగా ధరలు పెరిగాయని ముఖ్యమంత్రే చెబుతున్నా ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వడం లేదని విమర్శించారు. బెల్ట్ షాపుల ద్వారా ఆదాయం పొందడంపై చూపుతున్న శ్రద్ధను ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చూపడం లేదన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, స్థానికంగా ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
