Nagamani Malligari April 7, 2026Department of Animal Husbandry
పశుసంపద రక్షణతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం…
నరసరావుపేట, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమం, పశువుల ఆరోగ్య రక్షణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గంలో పశు వ్యాధి నివారణ కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు శ్రీకారం చుట్టారు.నరసరావుపేట మండలం అర్వపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన "జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం లో ఎమ్మెల్యే అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి, క్షేత్రస్థాయిలో పశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ వైద్య వృత్తిలో అపార అనుభవం ఉన్న నాయకుడిగా, "వ్యాధి వచ్చాక చికిత్స కంటే, రాకుండా అడ్డుకోవడమే విజ్ఞత" అని రైతులకు దిశానిర్దేశం చేశారు. గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పశువులు తీవ్ర అస్వస్థతకు గురై, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, ఇది పాడి రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క పశువు కూడా టీకా తీసుకోకుండా మిగిలిపోకూడదని అధికారులను కట్టుదిట్టంగా ఆదేశించారు. అనంతరం అర్వపల్లిలో నిర్వహించిన ప్రత్యేక పశువైద్య శిబిరం లో కూడా ఎమ్మెల్యే పాల్గొని రైతులతో ముచ్చటించారు. తమ సమస్యలపై అవగాహన కలిగి, స్వయంగా గ్రామాలకు వచ్చి పశువుల ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే చొరవను అర్వపల్లి గ్రామస్తులు, పాడి రైతులు కొనియాడారు. డాక్టర్ అరవింద బాబు తాను ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

