Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పస్రా-మేడారం రోడ్డుపై ప్రత్యేక తనిఖీలు

Abhi Naga August 28, 2026prabhanews.com

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై పోలీసుల ప్రత్యేక నిఘా
పండుగ చేసుకోండి..

ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరిక

గోవిందరావుపేట, ఆగస్టు 28 (ఆంధ్రప్రభ): పండుగ వేళ ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పస్రా-మేడారం ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ సూచనలతో పస్రా సీఐ పీ. దయాకర్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. పస్రా ఎస్సై ఎస్.కె. తాజుద్దీన్, మేడారం ఎస్సై ఎ. కమలాకర్, తాడ్వాయి ఎస్సై కె. జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

మద్యం సేవించి వాహనం నడపొద్దు

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరించారు. పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్‌బెల్ట్ వినియోగించాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రం, బీమా పత్రాలు తదితర వాహన సంబంధిత పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

యువతకు పోలీసుల పిలుపు

మద్యం వద్దు.. మాదకద్రవ్యాలు వద్దు.. అతివేగం వద్దు.. ప్రాణాలపై నిర్లక్ష్యం వద్దు అంటూ పోలీసులు యువతకు అవగాహన కల్పించారు. పండుగ ఆనందం మరో కుటుంబానికి విషాదంగా మారకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా ఇంటికి చేరాలని కోరారు.

"మీ రక్షణే మా బాధ్యత.. మీ సహకారమే మా బలం" అంటూ ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పస్రా ఎస్సై తాజుద్దీన్, మేడారం ఎస్సై కమలాకర్, తాడ్వాయి ఎస్సై జగదీష్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News