Bharath August 31, 2026prabhanews.com
అమరావతి, వెబ్‌డెస్క్: పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి పరిశ్రమ తన పరిధిలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, దాన్ని నిరంతరం సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు.
పచ్చదనం పెంపు అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా.. పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పవన్ కల్యాణ్ అన్నారు. పరిశ్రమల పరిసరాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ..
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు కీలకమైనప్పటికీ.. ప్రకృతి పరిరక్షణను విస్మరించకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. అభివృద్ధి, పర్యావరణ సమతుల్యత రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లినప్పుడే దీర్ఘకాలిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనం పెంపునకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
3,400 పరిశ్రమలపై దృష్టి..
2026 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, పేపర్, టెక్స్‌టైల్ తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం లక్ష్యాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 14 రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా తొలి విడత పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆయా పరిశ్రమల యాజమాన్యాలను పవన్ కల్యాణ్ అభినందించారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అనుసరించాలని కోరారు.
విశాఖ పరిసర పరిశ్రమలకు ప్రత్యేక సూచనలు
పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు పచ్చదనం పెంపుపై మరింత దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శ్రీ సిటీ, పరవాడ వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZలు) కూడా 33 శాతం పచ్చదనం నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
2047 నాటికి 50 శాతం పచ్చదనం లక్ష్యం..
రాష్ట్ర భూభాగంలో పచ్చదనాన్ని భారీగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంలో పారిశ్రామిక రంగం కూడా క్రియాశీలకంగా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రానికి మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
