Bharath August 28, 2026prabhanews.com
వికారాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నప్పటికీ.. నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం సామాన్యులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి.
బియ్యం ఉచితంగా లభించినా.. కుటుంబ అవసరాలకు కావాల్సిన ఇతర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
చక్కెర, ఉప్పు, పప్పులు, కారం పొడి, టీ పొడి, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా చక్కెర ధర కిలోకు గతంలో సుమారు రూ.60 ఉండగా.. ప్రస్తుతం రూ.80 వరకు చేరిందని వినియోగదారులు చెబుతున్నారు. ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా ఇదే విధంగా పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తారుమారవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ఉచితం.. మరోవైపు ధరల భారం
ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తున్నా.. వంటింటికి అవసరమైన మిగతా సరుకులను మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో బియ్యం రూపంలో లభిస్తున్న ప్రయోజనం కంటే ఇతర సరుకులపై పెరుగుతున్న ఖర్చే ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక చేత్తో సాయం చేస్తూనే.. మరోవైపు పెరిగిన ధరల రూపంలో భారం పడుతోందని సామాన్యులు వాపోతున్నారు.
దీనికి తోడు రేషన్ బియ్యం పంపిణీపై కూడా కొందరు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా అందాల్సిన రేషన్ బియ్యాన్ని మూడు నెలలకు ఒకసారి అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అర్హులైన కుటుంబాలకు సకాలంలో రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి
పేదలకు ఉచిత బియ్యం అందించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో ధరల పెరుగుదలను నియంత్రించి, సామాన్యులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఉచిత బియ్యం పథకం ప్రయోజనం పేదలకు పూర్తిస్థాయిలో అందాలంటే.. మిగతా నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
