Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

Pavan Chandragiri August 1, 2026

  • గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • 2027 జనవరిలో అక్కపల్లి లిఫ్ట్ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం

వెల్గటూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి చెరువును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ధర్మపురి నియోజకవర్గం గోదావరి ఒడ్డున ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రోళ్ళవాగు ప్రాజెక్టు అంచనాలను పెంచి అసంపూర్తిగా వదిలేశారని, అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంగా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని, అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసి 2027 జనవరిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తామని వెల్లడించారు.

స్తంభంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు స్తంభంపల్లి చెరువు మత్తడి, తూముల మరమ్మతులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గొల్లపల్లి మండలంలోని యశ్వంతరావుపేట చెరువు పూడికతీత పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

మేడారం రిజర్వాయర్ నుంచి ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బొమ్మరెడ్డిపల్లి-కొత్తపల్లి వరకు కాల్వ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News