Pavan Chandragiri October 24, 2026
గోదావరిఖని (అంధ్రప్రభ) :
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి.టి.
స్వామి శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బసంత్ నగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా, అదే సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన ఆకస్మిక మృతితో గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
విద్య, కార్మిక రంగాల్లో విశేష సేవలు..
విద్యావేత్తగా: సుమారు 4 దశాబ్దాల క్రితం 'వాణి విద్యా విహార్' పేరుతో విద్యాసంస్థలను స్థాపించిన పి.టి. స్వామి.. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. రాష్ట్ర పాఠశాలల సంఘం అభివృద్ధిలోనూ ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్)కి అనుబంధంగా సింగరేణి కార్మికుల కోసం 'తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం' (టీబీజీకేఎస్)ను స్థాపించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సింగరేణిలో యూనియన్ను బలోపేతం చేసేందుకు ఆయన సంవత్సరాల తరబడి శ్రమించారు. నిలువ నీడలేని వృద్ధుల కోసం రామగుండం నియోజకవర్గంలోని వీర్లపల్లి ప్రాంతంలో 'ఈశ్వర కృప' పేరుతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, ఒంటరి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ ఎంతో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ప్రముఖుల సంతాపం..
పీటీ స్వామి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు, టీబీజీకేఎస్ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మిక లోకానికి, విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
