Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న మహాధర్నా

Sowjanya Anneboina August 29, 2026prabhanews.com

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ నియోజకవర్గంలో చట్టబద్ధమైన పాలన లేకుండా పోయిందని, అమాయకులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆరోపించారు.

పోలీసుల పక్షపాత వైఖరి, దాష్టీకాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న కోదాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ప్రజాస్వామిక పక్షాలతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి బాధితురాలు గంధం కనకమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారుల తీరుపై, అధికార పక్ష కక్షసాధింపు చర్యలపై విమర్శలు చేశారు. వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలను పంపారనే కారణంతో హైదరాబాద్‌లో ఉన్న ఉపేందర్‌ను కోదాడ పోలీసులు తీసుకొచ్చి విచారణ పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. న్యాయవాదులు, బీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ జోక్యం చేసుకునే వరకు ఆయనను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.

ఉపేందర్‌కు సోదరి అనే కారణంతో కోదాడ బొడ్రాయి సెంటర్‌లో గత 30 ఏళ్లుగా పాన్‌ డబ్బా నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న గంధం కనకమ్మ డబ్బాను తెల్లవారుజామున తొలగించడం అన్యాయమని మల్లయ్య యాదవ్‌ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా న్యాయం కోసం నిరసన తెలిపిన మహిళలు, కుటుంబ సభ్యులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. టౌన్‌ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణంలో గంజాయి దందాలు, అక్రమాలు పెరిగాయని ఆయన ఆరోపణలు చేశారు.

పోలీసులపై గతంలో తాను చేసిన ఫిర్యాదులపైనా చర్యలు తీసుకోలేదని మల్లయ్య యాదవ్‌ పేర్కొన్నారు. తనపై అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పోలీసు అధికారిపై ఆధారాలతో డీజీపీ, ఎస్పీ, డీఐజీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఏడాదిన్నరగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలపై స్పందించని పోలీసులు సామాన్యుల జీవనోపాధికి సంబంధించిన విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

గతంలో దళిత యువకుడు కర్ల రాజేష్‌ విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ఉపేందర్‌ కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సామాన్య ప్రజల జీవనోపాధికి ఇబ్బంది కలిగించే చర్యలను నిలిపివేసి గంధం కనకమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరి, అక్రమ కేసులకు నిరసనగా సెప్టెంబర్‌ 2న కోదాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట సహచర, ప్రజాస్వామిక పక్షాలతో కలిసి భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బొల్లం మల్లయ్య యాదవ్‌ తెలిపారు. చట్టపరంగా న్యాయపోరాటం చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ బాధితుల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News