Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

Nagamani Malligari August 5, 2026prabhanews.com

సుల్తానాబాద్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, వార్డులు, ప్రసూతి విభాగం, ల్యాబ్, ఫార్మసీతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గర్భిణులను ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి నిరంతర పర్యవేక్షణలో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వార్డులు, మరుగుదొడ్లు, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

రోగులకు అవసరమైన మందులు, వైద్య పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, అత్యవసర సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోగుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, రిఫరల్స్‌ను తగ్గిస్తూ సాధ్యమైనంత మేరకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ తనిఖీలో సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News