Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతమైన ప్రత్యేక తనిఖీలు

ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతమైన ప్రత్యేక తనిఖీలు

Nagamani Malligari August 1, 2026prabhanews.com

మంచిర్యాల, ఆంధ్రప్రభ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు పిల్లల భద్రతను పరిరక్షించే లక్ష్యంతో ప్రతి ఏడాది రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలివేయబడిన, హోటళ్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించడం లేదా అవసరమైతే బాలల సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కమిషనరేట్ పరిధిలోని ప్రతి డివిజన్‌కు ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఏడాది జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 278 మంది బాలబాలికలను గుర్తించి రక్షించినట్లు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లాలో 130 మంది బాలురు, 21 మంది బాలికలు కలిపి 151 మంది బాలలను గుర్తించి రక్షించగా, 11 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 102 మంది బాలురు, 25 మంది బాలికలు కలిపి 127 మంది బాలలను గుర్తించి రక్షించగా, ఆరు కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు, బాల కార్మికులుగా పనిచేయిస్తున్నట్లు లేదా తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్-1098 లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాల కార్మికులను నియమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News