Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య ఉద్యమాలు బలోపేతం కావాలి..

Sowjanya Anneboina August 22, 2026prabhanews.com

ప్రజల హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలి..
యువత సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించాలి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, వామపక్ష నేతలు, గతంలో తనతో కలిసి పనిచేసిన మిత్రులను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు మావోయిస్టు మాజీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలిపారు.

శనివారం పెద్దపల్లికి వచ్చిన ఆయన 1980, 90 దశకాల్లో కలిసి పనిచేసిన పలువురు మిత్రులను కలిశారు.

ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలాంటి మార్గాలను అనుసరించాలి, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలనే అంశాలపై విస్తృత అవగాహన ఉన్న శక్తులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సంఘటితమై తమ హక్కుల కోసం చట్టబద్ధమైన మార్గాల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. యువత, నిరుద్యోగుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోందని రాజిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఇతర ఆకృత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు భద్రత కల్పించడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా మహిళా, ప్రజా సంఘాలు చట్టబద్ధమైన పోరాటాలు నిర్వహించాలని సూచించారు.

ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, జీవనోపాధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన మార్గాల్లో ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ప్రజలను చైతన్యపరిచి శాంతియుత, ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

దశాబ్దాల తర్వాత పాత మిత్రుల కలయిక..

మల్లా రాజిరెడ్డిని మాజీ నక్సల్స్‌ బోడకుంటి సత్తయ్య, ఆవుల రాజమౌళి, కొత్తూరు లింగన్న, ఎరుకల రాజయ్య, బాబు, పానుగంటి సత్తయ్య, బాలన్న, రామిల్ల బాపు, కంది చొక్కారెడ్డి, అడప లక్ష్మణ్‌, తిరుపతి, రమాపద్మ, వసంతక్క, రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, కట్టా నరేందర్‌, ప్రజాఫ్రంట్‌ నాయకులు గాండ్ల మల్లేశం, గుమ్మడి కొమరయ్య తదితరులు కలిశారు. దశాబ్దాల తర్వాత పాత మిత్రుల కలయిక ఆత్మీయ సమ్మేళన వాతావరణాన్ని తలపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News