Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన చైర్మన్ గాంధీ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అమ్మవారి నామస్మరణతో కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దర్శనం కోసం క్యూలైన్లలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో మంచినీరు అందించే ఏర్పాట్లను దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పర్యవేక్షించారు.
క్యూలైన్ల పరిస్థితిని పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వికలాంగ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లను కూడా చైర్మన్ బొర్రా గాంధీ పర్యవేక్షించారు. రద్దీ సమయంలో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ సాఫీగా దర్శనం జరిగేలా దేవస్థానం అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆధ్యాత్మికానందంతో తిరుగు ప్రయాణమయ్యారు.
