Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
నడిగూడెం, ఆంధ్రప్రభ: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని నడిగూడెం మండల తహసీల్దార్ లావూరి మంగ కోరారు.
సోమవారం నడిగూడెంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా కొనసాగుతున్న రసాయనిక వ్యవసాయం కారణంగా భూసారం దెబ్బతిన్నదని, తిరిగి భూసారం పెరగాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు.
రైతులు తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం వ్యవసాయ భూమిలో కనీసం అర ఎకరం లేదా ఒక పెద్ద మడిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని, భూమి లేని వారు ఇళ్ల వద్ద ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు సాగు చేసుకోవాలని అన్నారు. భూసారం పెంపునకు పశువుల పెంట, జీవామృతం, ఘనజీవామృతం, పచ్చిరొట్ట ఎరువులను వినియోగించాలని, చీడపీడల నివారణకు ఆవు మూత్రం, ఆవు పేడ ద్రావణం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, వావిలాకు కషాయం, లొట్టపీస ఆకు కషాయం వంటి సహజ ద్రావణాలను తయారు చేసుకుని పిచికారీ చేయాలని తెలిపారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు.
అనంతరం ఎంపీడీవో లావూరి మల్సూర్, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ మాట్లాడుతూ సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాలను అభినందించారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం మనందరి బాధ్యత, నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు.
ప్రకృతి వ్యవసాయం చేస్తామని, వ్యవసాయ భూమి లేని వారు ఇళ్లలో కూరగాయలు పెంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోలి మల్సూర్, వివిధ శాఖల అధికారులు, ఆదర్శ రైతు కన్నెబోయిన రామారావు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు హైమావతి, భాగ్యలక్ష్మి, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
