Rama Rao August 30, 2026Telangana
నాంపల్లి, ఆంధ్రప్రభ: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే కార్యక్రమంలో భాగంగా నాంపల్లి గ్రామపంచాయతీలో శనివారం గ్రామసభ నిర్వహించారు.
ముందుగా ఓటర్ల నుంచి పూర్తి వివరాలను సంబంధిత సిబ్బంది ద్వారా సేకరించిన అధికారులు, ఓటరు జాబితాలను గ్రామపంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. అనంతరం వివిధ కారణాలతో కొందరు ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించిన వివరాలను స్పష్టీకరించడం, నమోదులో ఉన్న పొరపాట్లను సరిచేయడం కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించేలా గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 324కు చెందిన నోటీసులు అందుకున్న ఓటర్లు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే నోటీసులకు ఎలాంటి జవాబులు ఇవ్వాలి, ఏ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలనే అంశాలపై సరైన అవగాహన లేక ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఓటరు పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇంటిపేర్లు, వయసు, ఇంటి నంబరు, వీధి నంబరు, తల్లిదండ్రులు-పిల్లల వయసుల మధ్య వ్యత్యాసాలు వంటి అంశాలపై నోటీసుల్లో ప్రశ్నలు ఉండటంతో పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, ఆర్‌ఐ గోపిరాజు గ్రామసభకు హాజరై ఓటర్ల సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఓటర్లు నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు సరైన వివరాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో జవాబులు సమర్పించాలని తహసీల్దార్ సూచించారు.
