Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నర్సరీలు..!

Rama Rao August 30, 2026Khammam, Telangana

-నర్సరీ నారు కొంటున్నారా..? అయితే జాగ్రత్త
-మొక్క నారు మాటున లాభాల దందా
-నర్సరీలు పదులు.. పర్యవేక్షణ ఏది..?

-లైసెన్స్ ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారుల సూచన

కారేపల్లి, ఆంధ్రప్రభ: వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులు నర్సరీ నారు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కారేపల్లి మండలంలో పుట్టగొడుగుల్లా నర్సరీలు వెలుస్తుండగా, వాటిని నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా? లేదా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. నారు విక్రయానికి సంబంధించి అనుమతులు, లైసెన్స్‌ తదితర అంశాలను రైతులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మండల పరిధిలో ఇప్పటికే 10కి పైగా నర్సరీలు ఏర్పాటైనట్లు తెలుస్తోంది. రైతులకు అవసరమైన వివిధ రకాల మొక్కల నారును అందిస్తున్న నిర్వాహకులు నాణ్యత, ధర విషయంలో స్పష్టత పాటించాల్సిన అవసరం ఉంది. అయితే, కొన్ని చోట్ల నారు ధరలను పెంచి రైతులపై అదనపు భారం మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో నారు ధరలు కూడా పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లైసెన్స్‌ ఉందా..? ముందుగా తెలుసుకోవాలి

నర్సరీ నుంచి నారు కొనుగోలు చేసే సమయంలో రైతులు సంబంధిత నర్సరీకి అనుమతులు, లైసెన్స్‌ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లైసెన్స్‌ లేకుండా నారు విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటున్నారు. నారు నాణ్యత, రకం, ధర తదితర వివరాలను తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

నాణ్యతపై రైతుల ఆందోళన

నారు నాణ్యతలో తేడా ఉంటే పొలంలో నాటిన తర్వాత మొక్కలు సరిగా ఎదగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఒకవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు నారు ధరలు కూడా పెరగడం రైతులకు భారంగా మారుతోంది. నారు కొనుగోలు సమయంలోనే రశీదు తీసుకోవాలని, అనుమతులు ఉన్న నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ..?

కారేపల్లి మండలంలో నర్సరీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నర్సరీల అనుమతులు, లైసెన్సులు, నారు నాణ్యత, విక్రయ ధరలను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నర్సరీలపై చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం కలగకుండా పర్యవేక్షణను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు నారు విక్రయించే పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని, అనుమతులు లేని నర్సరీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

నారు విక్రయాల్లో నిబంధనలు పాటించాలి
-ఆకుల వేణు, ఉద్యానాధికారి, వైరా డివిజన్

కారేపల్లి మండలంలో నర్సరీలు పెరుగుతున్న నేపథ్యంలో నారు విక్రయాలు, నర్సరీల నిర్వహణపై వైరా డివిజన్ ఉద్యానాధికారి ఆకుల వేణును ఆంధ్రప్రభ వివరణ కోరగా ఆయన స్పందించారు. లైసెన్స్ లేకుండా నర్సరీలు నిర్వహిస్తూ నారు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లైసెన్స్ లేని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నర్సరీలను నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా నారు విక్రయించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే రూ.50 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పారు. అనుమతులు ఉన్న నర్సరీల నుంచే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు నాణ్యత, రకం తదితర వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News