Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రామగుండంలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

కార్మికుల రక్షణకు కట్టుబడి ఉన్నాం..
పరిశ్రమలకు వేగంగా బొగ్గు రవాణా: జీఎం లలిత్‌కుమార్

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం ఏరియా-1లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్‌కుమార్‌ తెలిపారు. ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులు, ఉపరితల గనుల ప్రాజెక్టుల్లో ఆగస్టు నెలలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆగస్టు నెల ఉత్పత్తి వివరాలను వెల్లడించారు.

ఆగస్టు నెలలో 2,45,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 3,04,086 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు లలిత్‌కుమార్‌ వివరించారు. నిర్ణీత లక్ష్యం కంటే అధికంగా ఉత్పత్తి సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా నుంచి 2,45,200 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 2,50,739 టన్నుల బొగ్గును రవాణా చేసి 102 శాతం సాధించినట్లు తెలిపారు.

అదేవిధంగా జీడీకే-1,3 బొగ్గు గనుల్లో 64 శాతం, జీడీకే-2, 2ఏ బొగ్గు గనిలో 71 శాతం, జీడీకే-1ఏ గనిలో 298 శాతం ఉత్పత్తి సాధించినట్లు లలిత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికుల రక్షణకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని జీఎం పేర్కొన్నారు. గనుల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన బొగ్గును వేగంగా రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని లలిత్‌కుమార్‌ తెలిపారు. సింగరేణి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు చంద్రశేఖర్‌, రెడ్డిమల్ల తిరుపతి, ఆంజనేయులు, జితేందర్‌సింగ్‌, వేణు, హనుమంతరావు, వీరారెడ్డి, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News