Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు మామిడిపల్లి విద్యార్థులు

Sowjanya Anneboina August 29, 2026prabhanews.com

  • నలుగురు విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
  • సర్పంచ్‌, ఉపాధ్యాయుల అభినందనలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : మండలంలోని మామిడిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి శిక్షణ శిబిర ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన ఎన్‌. సాత్విక, డీ. నిత్యశ్రీ, ఆర్‌. విశాల్‌, కే. లక్షిత్‌లను సర్పంచ్‌ కూన లతా సాగర్‌ పాఠశాల సిబ్బందితో కలిసి అభినందించి సత్కరించారు. శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచిన కూన లక్షిత్‌ నందిగామ, సాత్విక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కూన లతా సాగర్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, మాక్లూర్‌ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని సర్పంచ్‌ తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు కైరంకొండ బాబు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాల తరఫున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ సమానంగా రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు వీ. భారతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా సాధన చేయడం, కష్టపడి శ్రమించడం వల్లే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. రాబోయే పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు వీ. భారతిని సర్పంచ్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ తరిగొప్పుల చిరంజీవి, కూన సాగర్‌, భోజేందర్‌, లింగన్న, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News