Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రాయలసీమకు తాగునీటి భరోసా..

Bala Raju August 5, 2026ap

శ్రీశైలం నుంచి నీటి విడుదల

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాయలసీమ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు శ్రీశైలం జలాలను భద్రంగా వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీటి నిల్వ ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు వరద జలాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన 63 శాతం వాటాలో తాగునీటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

హంద్రీ-నీవా పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీల నీరు అవసరమని మంత్రి తెలిపారు. అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీల నీటిని గురువారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగుగంగ పథకం ద్వారా చెన్నై నగరానికి తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని అందించాల్సి ఉందని, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమని మంత్రి వివరించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తూ, వర్షాలు, వరదల పరిస్థితులకు అనుగుణంగా నీటి వినియోగంపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, సాగునీటి, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News