Pavan Chandragiri October 13, 2026
- ఉదయం 11.30 గంటలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోరకు తెరలేవనుంది.
ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రేపు, అక్టోబర్ 14న విడుదల చేయనుంది. విజయవాడలోని ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడనుంది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల సందడి మొదలుకానుంది. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు..
ప్రతిపాదిత ఎన్నికల ప్రక్రియ ప్రకారం.. నోటిఫికేషన్ విడుదలైన మూడో రోజు నుంచి ఐదు రోజులపాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎనిమిదో రోజు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పదో రోజున బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
అభ్యర్థులకు ప్రచారం కోసం ఆరు రోజుల సమయం ఇచ్చి, 17వ రోజున పోలింగ్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే, ఇవి ప్రతిపాదిత వివరాలే. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్పష్టత రానుంది.
నవంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు?
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 10 నుంచి 15 మధ్య విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ తేదీలపై స్పష్టత రానుంది. దీంతో స్థానిక రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరగనుంది.
