Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రికార్డుల్లో ఘనం.. భౌతికంగా నిరుపయోగం..!

Nagamani Malligari September 2, 2026prabhanews.com

వందల కోట్లు ఖర్చయినా రైతులకు అందని సాగునీరు..

ఆసిఫాబాద్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు రైతులు ఆశించిన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయని తెలుస్తోంది.

నియోజకవర్గంలో కొమురం భీమ్‌ (ఆడ), వట్టివాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉండగా.. చేలిమల వాగు (ఎన్టీఆర్‌ సాగర్‌) చిన్న నీటి ప్రాజెక్టుగా ఉంది. వీటి నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలతో ప్రజాధనం వృథా అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోందని చెబుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో పలువురు రైతులు తిరిగి వర్షాధారిత పంటలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

కొమురం భీమ్‌ (ఆడ) ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 10.2 టీఎంసీలు. తొలుత 24,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించగా.. కాలువల పొడవును పెంచి 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేపట్టారు. అయితే ప్రాజెక్టు మట్టికట్ట నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్రారంభమైన మూడేళ్లకే మట్టికట్టకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

భారీ వర్షాలు కురిసిన సమయంలో మట్టికట్టకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం మట్టికట్టపై తాత్కాలికంగా పాలిథిన్‌ కవర్లు కప్పి ఉంచుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.2 టీఎంసీలు కాగా.. నీటి లభ్యత ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో కేవలం ఐదు టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలువల సిమెంట్‌ లైనింగ్‌ పనుల్లోనూ నాణ్యత లోపాలున్నాయని, పలుచోట్ల కాలువలకు గండ్లు పడటంతో రైతుల పొలాలకు సాగునీరు చేరడం లేదని రైతులు చెబుతున్నారు.

కొమురం భీమ్‌ (ఆడ) ప్రాజెక్టు మట్టికట్ట నిర్మాణంలో జరిగిన లోపాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పుణే నుంచి వచ్చిన నిపుణులు భూభౌతిక, భూసాంకేతిక అంశాలతో పాటు మట్టికట్టకు పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. అత్యవసర చర్యల ప్రణాళికను రూపొందించేందుకు రూ.82 లక్షలు కేటాయించినట్లు సమాచారం. సమస్యలను గుర్తించేందుకు భూసాంకేతిక నిపుణుల కోసం మరో రూ.42 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది.

నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి మరమ్మతులకు అవసరమైన చర్యలపై సూచనలు చేసినట్లు సమాచారం. అయితే సమస్యల పరిష్కారం సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కొమురం భీమ్‌ (ఆడ) ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం తాగునీటి అవసరాల కోసం 1.77 టీఎంసీల నీటిని మిషన్‌ భగీరథకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక నియోజకవర్గంలోని వట్టివాగు ప్రాజెక్టును 24,500 ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారు. అయితే ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 7 నుంచి 8 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కాలువల నిర్మాణంలో నాణ్యత లోపాలు, పూడిక పేరుకుపోవడం, పలుచోట్ల గండ్లు పడటంతో నీరు పొలాలకు చేరడం లేదని ఆరోపిస్తున్నారు.

వట్టివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులు సాగునీటి సమస్యపై పలుమార్లు ధర్నాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం కాలువల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నా.. పనులు నాణ్యతగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా కాలువలకు గండ్లు పడటం, మరమ్మతులు చేపట్టడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలను సరిదిద్ది.. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులపై నిపుణుల సూచనలను అమలు చేసి, కాలువల మరమ్మతులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News