Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రిమ్స్‌ అగ్నిప్రమాదం.. మరో ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమం

Pavan Chandragiri September 23, 2026

  • మెరుగైన వైద్యం కోసం నీలోఫర్‌కు తరలింపు..
  • మరో 15 మంది రిమ్స్‌లో చికిత్స

ఆదిలాబాద్‌, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో బాధితులైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదుగురు పసికందులు మృతి చెందగా.. చికిత్స పొందుతున్న వారిలో తాజాగా ఏడుగురు చిన్నారుల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వారిని హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు.

రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఏడుగురి పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యులు వెంటనే స్పందించారు. ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరమని భావించి నాలుగు ప్రత్యేక వాహనాల్లో వారిని హైదరాబాద్‌కు తరలించారు. నీలోఫర్‌ ఆసుపత్రిలో అత్యవసర వైద్య నిపుణుల పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం మరో 15 మంది చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. తాజా పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, ఏసీ పేలుడు కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు పసికందులు మృతి చెందారు. ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News