Nagamani Malligari September 23, 2026Infant Deaths, Newborn Babies, Niloufer Hospital, RIMS Incident, Telangana
మరో 19 మంది చిన్నారులకు చికిత్స
RIMS-SNCU-AC-Blast | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ యూనిట్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులకు తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. నిన్నటి వరకు ముగ్గురు నవజాత శిశువులు మృత్యువాత పడగా.. తాజాగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వారిలో ఒకరు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుల్లో దుబ్బగూడ, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రెండు రోజుల కిందట అర్ధరాత్రి రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ యూనిట్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఏసీ యూనిట్‌లో పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు భయంతో ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే దట్టమైన పొగ వార్డును కమ్మేసింది. ఏసీ పేలుడు అనంతరం పొగలో విషవాయువులు వ్యాపించడంతో చిన్నారులకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో మొత్తం 27 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది, చిన్నారుల కుటుంబ సభ్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వార్డులోకి వెళ్లి పలువురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఓ శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న మరో నలుగురు చిన్నారులు కూడా మృత్యువాత పడ్డారు. మృతుల్లో రెండు, ఐదు, పదిహేను రోజుల వయసున్న పసికందులు ఉన్నారు. వీరంతా ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.
పసికందుల వరుస మరణాలతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో 19 మంది చిన్నారులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Adilabad-RIMS-SNCU-AC-Blast-Five-Newborns-Dead
