Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రూ.500 కోట్ల భూమిపై 'రూ.87 కోట్ల' వివాదం

Abhi Naga August 30, 2026prabhanews.com

జామాబాద్ ఆయిల్‌ఫెడ్ స్థలాన్ని ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నమంటూ హరీష్‌రావు ఆరోపణలు
నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మహా పోరాటం తప్పదని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై రాజకీయ వివాదం ముదురుతోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిధిలోని అజామాబాద్‌లో ఉన్న ఆయిల్‌ఫెడ్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అజామాబాద్‌లోని 3 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఆయిల్‌ఫెడ్ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని హరీష్‌రావు ఆరోపించారు. అలాంటి విలువైన ప్రభుత్వ ఆస్తిని కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు.

ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా ఎందుకు ప్రైవేటుకు?

సంబంధిత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సంస్థను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తికి భూమిని అప్పగించాలనే ప్రయత్నం వెనుక ఉద్దేశం ఏమిటని హరీష్‌రావు నిలదీశారు. మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న భూమిపై ఇప్పుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు.

1987లో ఈ భూమికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రభుత్వ హక్కుకు అనుకూలంగా ఉందని హరీష్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వ భూమిని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు.

'రియల్ ఎస్టేట్ దందా' అంటూ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై ఆసక్తి చూపుతోందని హరీష్‌రావు విమర్శించారు. ఒకవైపు సామాన్యుల ఆస్తులకు సంబంధించి 22ఏ జాబితా పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారని, మరోవైపు అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.

అజామాబాద్ వ్యవహారం ఒక్కటే కాదని, కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లోని భూముల విషయంలోనూ ప్రభుత్వ విధానంపై అనుమానాలు ఉన్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా ప్రైవేటు చేతుల్లోకి ఇస్తే భవిష్యత్ తరాలకు ప్రజా అవసరాల కోసం భూములు కూడా మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్ణయం రద్దు చేయాలని డిమాండ్

అజామాబాద్ భూమి కేటాయింపునకు సంబంధించిన నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసి, ఆ భూమిపై ఆయిల్‌ఫెడ్‌కు పూర్తి హక్కులు కల్పించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ సహించబోదని స్పష్టం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అయితే, ఈ వ్యవహారంపై హరీష్‌రావు చేసిన ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. భూమి విలువ, కేటాయింపు ప్రక్రియ, యాజమాన్య హక్కులకు సంబంధించిన అంశాలపై అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News